Thursday, September 06, 2007

దేవదాసు - జగమే మాయా...

వేదాంతానికి భాష్యం చెప్పే పాట...
నేను దీన్ని సరిగ్గా అర్ధం చేస్కున్నానో లేదో తెలీదు కానీ.. నాకు అర్ధమైనంతలోనే... చాలా బాగా నచ్చిన పాట ఇది.

వేదాల సారాన్ని ఒక్క మాటలో తేల్చేశారు. ఈ జగమే ఒక‌ మాయ... అందులో మన బ్రతుకొక‌ మాయ!!! (ఈ మాయ గ్రహించక ఎందుకీ తాపత్రయం...)
కష్ట సుఖాలు.. కావడిలో అటూ ఇటూ వుండే కుండలంట... వాటిని నిలిపే కావడి - కొయ్య, ఆ కుండలేమో - మట్టి. తెలుసుకోవాల్సిన సత్యం!!!
దేని మీదా ఆశ పెట్టుకోకుండా పరుల‌కోసం జీవించడంలో ఆనందం వుంది.. బాధని ఆనందం అనుకుంటే ఇక అసలు కష్టమన్నదే వుండదు...

ఆహా... మనబోటి వారికి ఇంత లోతుగా ఆలోచించటం సాధ్యమయ్యే పనేనా...!!!
సాహిత్యమే కాకుండా, ఈ పాట వినడానికి కూడా చాలా హాయిగా వుంటుంది...

Song: జగమే మాయా...
Movie: దేవదాసు (1953)
Lyrics: సముద్రాల‌ Sr
Singer: ఘంటశాల‌
Music Director: Subbaraman C R

Tuesday, September 04, 2007

నువ్వొస్తానంటే నేనొద్దంటానా - ఆకాశం తాకేలా

చరితలు సైతం చదవని వైనం... కవితలు సైతం పలకని భావం.. సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే ... అంటూ ప్రేమకున్న గొప్పతనాన్ని చాలా గొప్పగా తెలియచేశారు సిరివెన్నెల గారు. సాహిత్య పరంగా నీకే పాట బాగా ఇష్టం అంటే... టక్కున ఇది గుర్తొస్తుంది. మొదటినుండి చివరి వరకూ ప్రతి వాక్యాన్నీ హృదయానికి హత్తుకునేలా రాశారంటే అతిశయోక్తి కాదేమో.

ఈ పాటలో నాకు నచ్చిన కొన్నివిశేషాలు:
వడగాలిలా ఈ భూమి ఆకాశానికి ప్రేమ సందేశం పంపితే.. అది తన చినుకులతో బదులిస్తుంది. ఆహా! చినుకులని తడిగానం అన్నారు...! ప్రాణం ఎప్పుడు మొదలయ్యిందో తెలియనట్టుగానే ప్రేమనేది ఎప్పుడు పుడుతుందో చెప్పలేము. నిజమే మరి... తల్లి కడుపులో బిడ్డకి యే క్షణాన ప్రాణ ప్రతిష్ట జరిగిందో తేల్చటం అసాధ్యం! "ప్రేమంటే ఏంటో వివరించగల మాటుంటే, అసలు ఆ మాటకి ప్రేమంటే ఏంటో తెలుసా" అంటూ ప్రేమ గురించి చెప్పగల మాటేదీ లేదన్నారు. పరుగులెత్తే నది తనలో చేరిన తొలి నీటి చుక్క ఏదో చెప్పలేదని ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు.. !!!

ప్రియురాలి సాంగత్యం ఎటువంటి గాయాలనైనా మరిపించగలదు. "జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే, నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా... రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే, ఆ కాంతే నువు వెతికే సంక్రాంతై ఎదురవదా" అద్భుతం! ఈ వాక్యాల గురించి నేనేమన్నా వ్రాస్తే వాటి అందం చెడగొట్టినదాన్నవుతా.

Song: ఆకాశం తాకేలా
Movie: నువ్వొస్తానంటే నేనొద్దంటానా
Singer: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు
Lyrics: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
Music Director: దేవి శ్రీ ప్రసాద్

తొలి పలుకులు

సంగీత సాహిత్యాలు... నా దృష్టిలో తోబుట్టువులు. దేనికదే సాటి! సంగీతానికి అర్ధవంతమైన సాహిత్యం తోఢైతే, ఇక ఆ గీతం ఒక వెలలేని ఆణిముత్యం!!
అప్పుడప్పుడూ కొన్ని పాటలు వింటుంటే... "అరె, same feelings! రచయిత కూడా నాలానే ఆలోచిస్తున్నారా లేక పాట విని నేను Inspire అయిపోయానా" అనిపిస్తుంది.
అటువంటి పాటలని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతోనూ, సంగీతమనే ఈ మహాసముద్రం లో వున్న లెక్కలేనన్ని ఆణిముత్యాలలో కొన్నిటిని వెలికి తీసేందుకూ ఈ blog మొదలుపెట్టాను! అప్పుడప్పుడూ రాళ్ళు కూఢా బయటకి రావచ్చు భయపడకండి :)